
తిరుమల , 30 అక్టోబర్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థాన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొత్తం ఐదు వేల వెంకన్న ఆలయాలను నిర్మించేందుకు సన్నద్ధమైంది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీలో మొత్తం ఐదువేల ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించింది. దీనికోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 750 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. గిరిజన ప్రాంతాల్లో ఈ ఆలయాలను ఎక్కువగా నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు అరికట్టడం, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే శ్రీవాణి ట్రస్ట్ నుంచి 175 కోట్ల రూపాయలను దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆయా గ్రామాల జనాభాను బట్టి తిరుమల శ్రీవారి ఆలయాలను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మూడు రకాల ఆలయాలను నిర్మించేందుకు నిధులు కేటాయించనున్నారు. ఇందులో 10 లక్షలు, 15 లక్షలు అలాగే 20 లక్షల చొప్పున నిధులు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలో ఒక్కో ఆలయానికి కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV