
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దారుణం చోటుచేసుకున్నది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడులో మార్నింగ్ వాక్కు వెళ్లిన రామారావును దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మరో మూడు రోజుల్లో మనవరాలు పెండ్లి ఉండగా రామారావు హత్యకు గురవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పాతర్లపాడు గ్రామ సర్పంచ్గా రామారావు పనిచేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు