
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.) ఇందిరా గాంధీ అంటే కేవలం ఎమర్జెన్సీ
కాదు.. అభివృద్ధి, దూరదృష్టి, దౌత్య నాయకత్వానికి ప్రతీకగా తన పాలనలో చూపారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి శుక్రవారం సచివాలయంలో తన ఛాంబర్లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గరీబీ హటావో నినాదంతో సామాజిక న్యాయ పోరాటానికి చిహ్నమైన నాయకురాలని అన్నారు. 20 సూత్రాల కార్యక్రమంతో గ్రామీణ పేదరిక నిర్మూలనకు మార్గదర్శకులని అభివర్ణించారు. మహిళా సాధికారత, తాగునీరు, ఆరోగ్యం, చిన్నారుల పోషణ, ఎస్సీ, ఎస్టీ న్యాయం, అన్నీ ఇందిరమ్మ దృష్టిలో భాగమనీ పేర్కొన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పించి, ఆత్మనిర్భర భారత్కు పునాది వేసిన దార్శనికురాలు అని కొనియాడారు. శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిలో భారత్కి కొత్త దిశ చూపిన విజనరీ నాయకురాలు అని అన్నారు. అప్పటి వరకు ధనవంతులకే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేసి పేద రైతు తలుపు తట్టిన నేత అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..