హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
వందేళ్ల ముందు చూపు కేసీఆర్
ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేతగాని తనం వల్ల సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను పడావు పెట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ లను పూర్తి చేసి వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణం అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు. డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదని.. బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గం అన్నారు. బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఒకటో తేదీనే జీతాలు అన్న రేవంత్ రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదని ప్రశ్నించారు. రూ. 1400 ఆరోగ్య శ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..