న్యూ డిల్లీ,, 4 అక్టోబర్ (హి.స.) పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో.. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని త్వరలోనే భారత్కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బ్రిటన్ అధికారులు వచ్చే నెల అంటే నవంబర్ 23న నీరవ్ మోదీని భారత్కు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అతన్ని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచనున్నట్లు సమాచారం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు నీరవ్ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్థిక నేరగాన్ని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..