ఘజియాబాద్ (యు.పి), 4 అక్టోబర్ (హి.స.)
యూపీలోని ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీ రోడ్డులోని రాకేష్ మార్గ్ కట్ సమీపంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్ చేస్తున్న వారిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో విహార్ కాలనీకి చెందిన విపిన్ శర్మ (47), కొత్వాలి ప్రాంతంలోని న్యూ కోట్గావ్ నివాసితులు మీను ప్రజాపతి (56), కమలేష్ (55), సావిత్రి దేవి (60) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మీను, సావిత్రిలు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక చికిత్స సమయంలో కమలేష్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
విపిన్ శర్మ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధవల్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..