హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
'కాకా' చూపిన మార్గంలోనే నేటి
కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకట స్వామి 96 వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్బండ్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన కాకా కాంగ్రెస్ పార్టీకి ఆదర్శప్రాయ నేత అని అన్నారు. దళిత, బహుజన వర్గాల పక్షాన ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వెల్లడించారు. ఆయన చూపిన మార్గంలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ సీఎల్పీ లీడర్ జానా రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు