విశాఖపట్నం, 5 అక్టోబర్ (హి.స.)
ఇటలీకి చెందిన 16 మంది విదేశీయులు విశాఖలోని యారాడ బీచ్ సందర్శనకు వచ్చారు. స్నానం చేస్తుండగా వారిలో ఒకరు మృతి చెందారు. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉందని, ఈతకు అనుకూలం కాదని.. మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లారు. ఇద్దరు ఇటాలియన్లు అలల ఉద్దృతికి కొట్టుకుపోగా.. పోర్టు మెరైన్ పోలీస్ అప్పారావు, జీవీఎంసీ లైఫ్ గార్డులు వెంటనే అప్రమత్తమై మునిగిపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీపీఆర్ చేసినా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ