హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై పోల్, స్థానిక సంస్థల ఎన్నికల గురించి తెలంగాణ బిజెపి నేతలు అత్యవసర సమావేశం అయ్యారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అవకాశాన్ని బీజేపీ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి మోడీ పథకాలే కారణం అని కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే ఎన్నికల్లో నాయకులంతా సమిష్టి కృషితో పని చేయాలని సూచించినట్లు సమాచారం. మరో వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ ఇప్పటికే ఓ
కమిటీని ఏర్పాటు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..