అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)
రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ