అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)
గాజువాక: పెద గంట్యాడలో అదానీ పోర్టు, గంగవరం పోర్టు యాజమాన్యం ఏర్పాటుచేయ తలపెట్టిన అంబుజా సిమెంట్ యూనిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం ఉద్రికత్తకు దారితీసింది. పెద గంట్యాడ జీవీఎంసీ మైదానంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి అధికారులు రాకుండా ఉక్కు నిర్వాసిత కాలనీలు, మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఆందోళనకారులు టెంట్లు, కుర్చీలను విసిరేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జనం తండోపతండాలుగా తరలివచ్చి అధికారులను మాట్లాడనివ్వలేదు. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగడంతో జిల్లా యంత్రాంగం వెనక్కి వెళ్లిపోయింది. ఇళ్ల మధ్య సిమెంట్ యూనిట్ ఏర్పాటుచేస్తే నివశించలేమని, ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామని నినదించారు. ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చడంతో 360 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్‌కు వాస్తవ పరిస్థితిని నివేదిస్తామని పెద గంట్యాడ తహసీల్దార్ అమల ఆందోళనకారులకు చెప్పి వెళ్లిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ