హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
అడ్లూరి లక్ష్మణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు అన్నలాంటోడని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు గత 30 ఏళ్లుగా ఉన్న స్నేహ బంధం రాజకీయాలకు మించినదేనని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందని.. భవిష్యత్తులోనూ కొనసాగుతోందని అన్నారు. అడ్లూరిపై తాను ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని ఆరోపించారు. దీంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివాడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తాను తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. అందుకు తాను తీవ్రంగా చింతిస్తున్నానని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో ప్రజల అభ్యున్నతికై తామిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..