అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే భారీగా పెట్టుబడులను ఆకర్షించామని ఆయన తెలిపారు. ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రిక 'బిజినెస్ స్టాండర్డ్' కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో లోకేశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ భాగస్వామ్యాన్ని రద్దు చేయడం, అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెనక్కి తీసుకోవడం వంటి చర్యలతో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. తమ హయాంలో 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులు, గత ఐదేళ్లలో కేవలం 3 శాతమే ముందుకు సాగాయని విమర్శించారు. ఆ కాలంలో విజయవంతంగా పూర్తయిన ఏకైక ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం కట్టిన రూ.550 కోట్ల ప్యాలెస్ మాత్రమేనని లోకేశ్ ఎద్దేవా చేశారు.
2024లో చారిత్రక తీర్పుతో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, ప్రతిష్టను పునర్నిర్మించడంపై దృష్టి సారించామని తెలిపారు. గడిచిన 17 నెలల్లోనే రూ.10.7 ట్రిలియన్ల విలువైన పెట్టుబడులను ఖరారు చేశామని, అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్జీ, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఇది తిరిగి వస్తున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
రాబోయే రోజుల్లో పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు, నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్‌లో ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు’ నిర్వహించనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. మరో రూ.10 ట్రిలియన్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఒక స్టార్టప్ కంపెనీలా వేగంగా, క్రమశిక్షణతో పనిచేస్తుందని, పెట్టుబడిదారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి తాను వ్యక్తిగతంగా వాట్సాప్‌లో అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ దేశ ప్రగతికి దోహదపడుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి తమకు పూర్తి సహకారం అందుతోందని లోకేశ్ తన వ్యాసంలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV