పిఠాపురం , 8 అక్టోబర్ (హి.స.) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం (అక్టోబర్ 9) ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని వారు చేస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన సముద్రంలోకి వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే, ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్, అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటన ద్వారా మత్స్యకారుల వాదనల్లోని వాస్తవాలను గ్రహించి, తగిన చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV