నర్సీపట్నం, 8 అక్టోబర్ (హి.స.)మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. అయితే, వైసీపీ ప్రతిపాదించిన పర్యటన మార్గాన్ని తిరస్కరించి, 18 నిబంధనలతో ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సూచనలకు వైసీపీ నాయకత్వం అంగీకరించడంతో, కొత్త రూట్‌లోనే పర్యటన జరగనుంది.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్ పర్యటనకు ఆటంకాలు కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకుండా అడ్డుకోవాలనే కుట్రతోనే పోలీసులు రూటు మార్చారని ఆయన విమర్శించారు. పర్యటన ఏర్పాట్లు, భద్రతకు సంబంధించి తాము పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ, వారు తమ ప్రతిపాదనను కాదని వేరే మార్గంలో అనుమతి ఇచ్చారని తెలిపారు.
పోలీసులు జారీ చేసిన తాజా రూట్ మ్యాప్ ప్రకారమే జగన్ పర్యటన కొనసాగుతుందని అమర్నాథ్ స్పష్టం చేశారు. మార్గమధ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు జగన్‌ను కలుసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, బల్క్ డ్రగ్ పార్క్ సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక సమస్యలపై తమ పార్టీ వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV