
న్యూఢిల్లీ, 12 నవంబర్ (హి.స.)
ప్రధాని మోదీ బ్యాచిలర్స్ డిగ్రీ
అంశంలో కొనసాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించే అంశంలో ఫైలింగ్ అయిన అభ్యర్థనలకు స్పందించాలని హైకోర్టు పేర్కొన్నది. అయితే ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల సమయాన్ని ఇచ్చింది కోర్టు. చీఫ్ జస్టిస్ దేవేందర్ కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆగస్టులో ఇచ్చిన ఏకసభ్య జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ జరగాల్సిన అప్పీల్ ఆలస్యం అవుతున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
ఢిల్లీ వర్సిటీ తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వాదిస్తున్నారు. ఈ కేసుపై 2026, జనవరి 16వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు