
అమరావతి, 13 నవంబర్ (హి.స.) ఇప్పటికే భారీగా పెరిగిన చలి వాతావరణంతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ (Department of Meteorology) మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఈ నెలలో రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 17న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తీర ప్రాంతాల్లో గాలుల వేగం పెరగవచ్చని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ప్రస్తుతం బంగాళాఖాతంపై ఏర్పడిన వాతావరణ పరిస్థితులు చురుకుగా మారుతున్నాయని, ఆ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు భారీ నుంచి అతి భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులు విపత్తు నిర్వహణ విభాగాలను అప్రమత్తంగా ఉండమని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV