
తిరుమల, 16 నవంబర్ (హి.స.)
: భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లను ఇదే విధానంలో నమోదు చేసుకున్నాక ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీచేస్తారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 21న ఉదయం పది గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 25న ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం మూడింటికి అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులో ఉంటుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే ఆర్జితసేవలు, సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ