
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)పథనంతిట్ట: శబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.
మండల పూజ సీజన్‌లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్‌లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు