ఇరాక్లో ఉన్న జగిత్యాల యువకుడికి సైబర్ ముఠా టోకరా.. రూ.87 వేల మోసం
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన బద్ది రాకేష్ సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. అప్పుల పాలై జీవనోపాధి కోసం పదిరోజుల క్రితం ఇరాక్ వెళ్ళిన రాకేష్, సోషల్ మీడియా ప్లాటఫార్మ్ అయిన ఫేస్ బుక్లో
సైబర్ క్రైమ్


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన బద్ది రాకేష్ సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. అప్పుల పాలై జీవనోపాధి కోసం పదిరోజుల క్రితం ఇరాక్ వెళ్ళిన రాకేష్, సోషల్ మీడియా ప్లాటఫార్మ్ అయిన ఫేస్ బుక్లో వచ్చిన ఒక పోస్ట్ను లైక్ చేశాడు. యూట్యూబర్ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన ముఠా సభ్యులు రాకేష్తో పరిచయం పెంచుకున్నారు. విశ్వాసం కల్పించేందుకు హర్ష సాయి పేరుతో ఉన్న ఆధార్ కార్డు కాపీ పంపించి, నీ అప్పులు తీర్చడానికి ఐదు లక్షలు సహాయం చేస్తాం” అని చెప్పి నమ్మించారు. తరువాత ఫోన్పే ద్వారా ₹6.5 లక్షలు పంపినట్టు నకిలీ స్క్రీన్షాట్లు పంపి మోసం మొదలుపెట్టారు. డబ్బులు అందకపోవడంతో రాకేష్ ప్రశ్నించగా, ఫండ్ విడుదల కావాలంటే టాక్స్ చెల్లించాలి అని నమ్మబలికారు.

దీంతో గుడ్డిగా నమ్మిన రాకేష్ ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఖాతాల నుండి అప్పు తెచ్చి విడతల వారీగా మొత్తం ₹87,000 ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించాడు. ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ, చెల్లించకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామని, కఠిన శిక్ష పడుతుందని బెదిరింపులు చేసిన సైబర్ ముఠా సభ్యులు, భయపెట్టే వీడియోలు కూడా పంపారు. మోసానికి గురైన రాకేష్, ఇరాక్ నుంచే ఇక్కడ ఉన్న తన మిత్రులను సంప్రదించాడు. వారి సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande