
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)
మైలార్ దేవ్ పల్లి డివిజన్
ఆరాంఘర్ ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ఆక్రమణలపై రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. ఆరాంఘర్ చౌరస్తా నుంచి పరివార్ ధాబా వరకు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్లు, ఫుట్ పాత్లు ఆక్రమించి వెలసిన అక్రమ నిర్మాణాలతో, చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించారు. ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుకు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు.
పరివార్ ధాబా రెస్టారెంట్ నిర్వాహకులు ఆక్రమించిన పుట్ పాత్ ఆక్రమణలను అధికారులు తొలగించారు. శనివారం ఉదయం 7 గంటల నుండే రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్ పోలీసుల బందోబస్తు నడుమ ఆక్రమణలను కూల్చివేశారు. ఇష్టానుసారంగా రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ హెచ్చరించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించిన ప్రదేశంలో తిరిగి ఎవరైనా డబ్బాలు ఏర్పాటు చేసిన నిర్మాణాలు చేసిన జరిమానాతో పాటు ఎలాంటి సమాచారం లేకుండానే తొలగిస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు