
అమరావతి, 22 నవంబర్ (హి.స.)
:ఇటీవల మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. ఆ పరిస్థితులను నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 24 (సోమవారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ