
అమరావతి, 24 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌ల మార్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా, ఇప్పటికే ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి భేటీ అయింది. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలు, వాటికి సంబంధించిన పరిపాలనా, భౌగోళిక అంశాలను పరిశీలించింది. గతంలో ఒకసారి సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అభిప్రాయాలు, ప్రతిపాదనలను తెలియజేసింది.
అయితే, ఈరోజు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం సమావేశం కాబోతుంది. ఇందులో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, పరిపాలన సౌలభ్యం, ప్రజల డిమాండ్లు లాంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇక, ఈ నెల 28వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాలపై నిర్ణయాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత పరిపాలనా సౌలభ్యం కలిగించేలా ఉండాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ