
కడప, 24 నవంబర్ (హి.స.)వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లా నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించేందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు పలు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం జగన్ బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ లో పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు, వినతులను స్వీకరిస్తారు.
నవంబర్ 26వ తేదీని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయించారు. స్థానిక నాయకుడి వివాహ వేడుకకు హాజరవడంతో పాటు మరికొందరిని వ్యక్తిగతంగా కలుసుకుంటారు. పర్యటన ముగించుకుని 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందులలోని క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV