
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. తన నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ విద్యా రంగానికి స్వర్ణయుగం తీసుకువచ్చారని, గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు. గత పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంది, అని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..