
అయోధ్య, 25 నవంబర్ (హి.స.)
శ్రీరామ జన్మభూమి మందిరంలో
జరిగిన చారిత్రక 'ధ్వజారోహణం' ప్రధాని మోడీ, సీఎం యోగీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ..ఈ రోజు తమకు 'సానుకూలత దినం గా అభివర్ణించారు. ఈ మహత్తర ఘట్టం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతో మంది ఆత్మలకు నేడు శాంతి లభించి ఉంటుంది అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ముఖ్యంగా అశోక్ జీతో పాటు, తమ ప్రాణాలను అర్పించిన సాధువులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అలాగే మందిర నిర్మాణం కేవలం ఒక కలగా చూసినప్పటికీ అందులో పాల్గొనలేని వారందరూ ఈ రోజు తమ లక్ష్యం నెరవేరినందుకు సంతృప్తి చెందుతారని మోహన్ భాగవత్ అన్నారు.
అలాగే రామ మందిర నిర్మాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ, మందిరం నిర్మాణం పూర్తయింది, జెండా ఎగిరింది. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి ఉపశమనం అందించిన రామరాజ్యపు జెండా, నేడు మందిరం శిఖరంపై రెపరెపలాడటాన్ని మనమందరం చూశాం అని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రసంగం మందిర ఉద్యమం వెనుక ఉన్న భావోద్వేగ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను స్పష్టం చేసింది. ఈ జెండా ఆవిష్కరణ కేవలం ఒక నిర్మాణం పూర్తి కావడాన్ని కాకుండా, దేశంలో ధర్మం, సమగ్రత, ఆదర్శవంతమైన పాలన అయిన 'రామరాజ్యం' యొక్క ఆశయాలు స్థాపించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..