
విజయవాడ, 25 నవంబర్ (హి.స.)
: ఇంద్రకిలాద్రిలో భక్తుల సౌకర్యం కోసం కనకదుర్గమ్మ దేవస్థానం ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టింది. సర్వదర్శనం (ఉచిత దర్శనం) క్యూలో వచ్చే భక్తులకు కూడా ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక ట్రయల్ రన్ నిర్వహించారు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రయోగాత్మక కార్యక్రమం సాగింది.
ఈ సందర్భంగా ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులను ప్రత్యేకంగా అంతరాలయ దర్శనం లైన్‌లోకి మెర్జ్ చేయడం ద్వారా ఒక్కసారిగా అమ్మవారి అంతరాలయంలోనుంచి దర్శనం పొందే అవకాశం ఇవ్వబడింది. ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ స్వయంగా వచ్చి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం కొనసాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మొత్తం ఒక గంటలో 1500 మందికి పైగా భక్తులు ఉచిత దర్శనం క్యూలైన్ నుంచే నేరుగా అంతరాలయ దర్శనం సౌకర్యం పొందారు. సాధారణంగా ఇలాంటి అవకాశం కేవలం ప్రత్యేక దర్శనం లేదా టికెట్ ధారులకు మాత్రమే లభిస్తుండగా.. ఉచిత దర్శనం భక్తులకు ఆకస్మికంగా ఇదొక ప్రత్యేక అనుభూతి కలిగింది. ఈ అవకాశాన్ని అందించినందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ మాట్లాడుతూ.. ఉచిత దర్శనం క్యూలైన్ భక్తులకు కొద్దిసేపు అంతరాలయ దర్శనం సౌకర్యం కల్పించడంపై ఇవాళ ప్రయోగాత్మకంగా పరిశీలించామని, ఫలితాలను ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి, దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆమోదంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతంగా నిలవడంతో ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లో అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ