
కరీంనగర్, 27 నవంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
గంగాధర మండలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గురువారం ప్రత్యేక పర్యటన నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తల భాగంగా ఆయన కురిక్యాల రైతు వేదికను, ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటయ్యే పోలింగ్ కేంద్రాల సిద్ధతను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. తర్వాత మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, సున్నిత ప్రాంతాల భద్రతా పరిస్థితుల పై స్థానిక పోలీసు అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజున అదనపు బలగాలను మోహరించి మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు