
నిజామాబాద్, 27 నవంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్
స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఈ నెల 24న జరిగిన ఆకుల అనంత అనే మహిళ హత్య కేసును నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హంతకుడు మృతురాలి మేనమామేనని, విచారణలో తేల్చినట్లు నిజామాబాద్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ మండలం మోస్రా గ్రామానికి చెందిన కుమరం అలియాస్ పాండవల సాగర్ అనే వ్యక్తికి ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరం కావడంతో తన మేనకోడలు ఆకుల అనంత అలియాస్ సోనీ వద్ద ఉన్న బంగారు ఆభరణాల పై కన్నేశాడు. ఆ ఆభరణాలను దొంగిలించాలనే ఉద్దేశంతో ఈ నెల 24న ఆమె ఇంటికి వెళ్లి గొంతు నులిమి హత్య చేసిన నిందితుడు, మృతురాలి చెవులకు ఉన్న కమ్మలు, మాటీలు, మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించి పారిపోయిన నిందితుడిని బుధవారం ఉదయం నిజామాబాద్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు