
నిజామాబాద్, 27 నవంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ను అనుసరిస్తూ నిజామాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని నవీపేట మండలం పరిధిలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవీపేట మండలం అభంగపట్నం, రెంజల్ మండలం వీరన్న గుట్ట, ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు