
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.) తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో కీలక ఘట్టం షురూ అయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇవాళ ప్రారంభమైంది. తొలి దశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి నామినేషన్ల దాఖలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజున బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..