
అమరావతి, 27 నవంబర్ (హి.స.)కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నుండి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదన్నారు. ప్రతిరోజు అక్కడ నుండి వందలాది వేలాది మంది హైదరాబాద్ కు వస్తున్నారని చెప్పారు. తగిలితే వాళ్ల దిష్టే హైదరాబాద్ కు తగులుతుందని వ్యాఖ్యానించారు. ఒక వేళ దిష్టి తగులుతుంది అనుకుంటే దిష్టి బొమ్మను పెట్టుకోవాలని సూచించారు. దిష్టిబొమ్మను పెట్టుకుంటే మేమేమైనా ఆపామా అంటూ ప్రశ్నించారు. అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మాట్లాడేటప్పుడు నాలుకకు కంట్రోల్ లేకుండా బుర్రకు పనిచెప్పకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇంత తెలివిలేనివాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లాల్లో పల్లె పండుగ 2.0లో భాగంగా రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సముద్రపు నీరు పోటెత్తడం వల్ల పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని అన్నారు. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అన్నారు. కొబ్బరి చెట్లతో చాలా పచ్చదనంగా ఉంటుందని తెలంగాణ నాయకులు చెప్పేవారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV