స్వామివారి విషయంలో ఏ తప్పు చేయలేదు.. పాలీగ్రాఫ్ టెస్టుకు నేను సిద్ధం: వైవీ సుబ్బారెడ్డి
తిరుమల 27 నవంబర్ (హి.స.) శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోలు వ్యవహారంపై జరుగుతున్న వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకు
సుబ్బారెడ్డి


తిరుమల 27 నవంబర్ (హి.స.) శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోలు వ్యవహారంపై జరుగుతున్న వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, సిట్ దర్యాప్తును కేవలం 2019-24 మధ్య కాలానికే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకుముందు జరిగిన కొనుగోళ్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్ఠను పెంచేందుకే పనిచేశానని, దేవుడి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని సుబ్బారెడ్డి అన్నారు. తనపై విషప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసినప్పుడు తాను సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను తప్పు చేసి ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు.

సిట్ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేశారని మీడియాలో కథనాలు రావడం దురదృష్టకరమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నెయ్యి ట్యాంకర్లను క్షుణ్ణంగా పరిశీలించి, ల్యాబ్ టెస్టుల తర్వాతే వినియోగించామని వివరించారు. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి కొనుగోళ్లపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవాణి దర్శనం ద్వారా పారదర్శకత తీసుకువచ్చామని, శ్రీనివాస సేతు నిర్మాణంలో ప్రజాధనాన్ని ఆదా చేశామని, తిరుమలలో ప్లాస్టిక్‌ను నిషేధించామని తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన గుర్తుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande