
గుంటూరు,28 నవంబర్ (హి.స.)
:అమరావతికి ఇది కొత్త జోష్! ‘రాజధాని’కి సరికొత్త కళ! ఇప్పటిదాకా ‘ఆంధ్రప్రదేశ్’లో ఎక్కడెక్కడో, అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతోంది. శుక్రవారం ఒకే రోజు, ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 11.22 గంటలకు ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు కూడా పాల్గొంటారు. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్థి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) తెలిపింది. ఈ బ్యాంకు కార్యాలయాలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో కొలువుదీరనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ