
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపి నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పగటిపూట బీసీల గొంతు కోసిన బీజేపీ నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బీజేపీ నాయకులే, వీరు బీసీ ద్రోహులు, వెన్నుపోటు దారులని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు