
జయశంకర్ భూపాలపల్లి, 28 నవంబర్ (హి.స.)
గ్రామ పంచాయతి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతి, భద్రతలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. శుక్రవారం ఆయన గణపురం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్, గణపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న సిబ్బందికి నామినేషన్ ప్రక్రియను పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి అని ఆదేశించారు. ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, నిరంతర పేట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు పంపిణీ, మద్యం సరఫరా, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలువంటి ఘటనలు ఎక్కడైనా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు