
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
మహానటి సావిత్రి గారి 90వ జయంతి
సభలను నిర్వహించబోతున్నట్లు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు 'సావిత్రి మహోత్సవ్' పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ కళా సంస్థ 'సంగమం' ఫౌండేషన్తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90వ జయంతి సభలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకా దత్, స్వప్నాదత్, 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలనూ ప్రత్యేకంగా సత్కరించనున్నారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా.. చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..