
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ తన స్వార్థానికి వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ దీక్షా దివస్ పేరుతో సెంటిమెంట్ ను ప్లే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని పేర్కొన్నారు. ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్షను మూడురోజులకే మధ్యలో ముగించి వెళ్లడంతో.. విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే రాలదని, కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందని మహేశ్ కుమార్ అన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు, కేసీఆర్ చేసిన దీక్షకు పొంతన లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారని, వారి ప్రాణ త్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగామన్నారు. కానీ దీనిని కేసీఆర్ కేవలం తమ కుటుంబ పోరాటంగా చూపించుకుని రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..