
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణ కోసం ప్రభుత్వం నవంబర్ 22న జీవో నెం.46ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50 శాతం కంటే ఎక్కువ కాకూడదని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జీవో నెం.46 ప్రకారం చట్టవిరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని, వెంటనే పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని సవాలు చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు వేర్వేరుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ విడుదల చేసిన జీవో నెం.46పై ఈ దశలో తాము స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ఇరు పక్షాల వాదనల సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. సబ్ కేటగిరి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎన్నికలు రద్దు చేయాలని కోరుతున్నారా..? అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండదని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించగా మాటతో ధర్మాసనం కూడా ఏకీభవించింది. అనంతరం చీఫ్ జస్టిస్ రియాక్ట్ అవుతూ... 42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు చేపట్టాలని చెప్పాం కదా అని కామెంట్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు