
గుంటూరు, , 28 నవంబర్ (హి.స.)
‘తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా రాజధాని అమరావతిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం కృష్ణానది పక్కన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. రూ.260 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను రెండున్నరేళ్లలో పూర్తిచేయాలి’ అని టీటీడీని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం 10.55 నుంచి 1.30 గంటల మధ్య ద్వితీయ చతుర్ద్వార మహా ప్రాకారం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం, నివేదనం, దివ్య సమర్పణ, హోమం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు. వేదమంత్రాలు, మంళవాయిద్యాలు, భక్తుల గోవిద నామస్మరణల మధ్య చంద్రబాబు పునాది రాయి వేయడంతో అభివృద్థి పనులు ప్రారంభమయ్యాయి.
శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘దేవతల రాజధాని అమరావతి.. మన రాజధాని కూడా అమరావతి.. ఆ వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే ఈ పేరు పెట్టాను. ఆయన చిత్తంతోనే రాజధాని రైతులు కూడా భూములిచ్చారు. 29వేల మంది రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది శ్రీవారి ఆశీస్సులతోనే సాధ్యం. దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని స్వామిని కోరుకుంటున్నా’ అన్నారు. ఎన్టీఆర్ అన్నదానం.. నేను ప్రాణదానం..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ