
అమరావతి, 28 నవంబర్ (హి.స.)
దేవతల రాజధాని.. రైతుల త్యాగం అమరావతి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. అమరావతిలో బ్యాంకు భవనాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. దేవతల రాజధానిని దెయ్యాల లాగా నాశనం చేయాలని చూశారని.. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి విశాఖటప్నంలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో తామంతా ముందుకెళ్లామన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కోసం పోరాడామన్నారు. జై అమరావతి అంటే కేసులు పెట్టారని, మహిళలను పోలీసు బూట్లతో తన్నారని పేర్కన్నారు. 1130 రోజులు ఉద్యమం నడిచిందని అన్నారు. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మూడు వేల మందికి పైగా రైతులపై కేసులు పెట్టారన్నారు. అమరావతి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి అని తామంతా గర్జించామన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపుతో మూడు పంటల భూమిని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని నిశ్చయమైందన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పనులు జెట్ స్పీడ్ లో అవుతున్నాయని పేర్కొన్నారు. శక్తివంతమైన స్త్రీ శక్తి అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తొస్తారన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల వారు అబద్ధాలు చెబితే చుక్కలు చూపిస్తారన్నారు. మహిళలు ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV