
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)
మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్
మెట్రో రైల్ సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల లగేజీ కష్టాలను తీర్చనుంది. ఇందుకోసం టక్కీట్ అనే సంస్థతో కలిసి పనిచేయనుంది. తొలివిడతలో కేవలం ఏడు స్టేషన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణించే వారి వద్ద హెల్మెట్లు, బ్యాగులు, ఇతర షాపింగ్ సంచులు వంటివి ఉంటుంటాయి. రద్దీగా ఉండే సమయాల్లో అయితే వీటిని మోస్తూ జర్నీ చేయడం చాలా కష్టం. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఆ బాధలుండవు. లగేజీని స్టేషన్లలోనే లాకర్లో సేఫ్ గా పెట్టుకుని, హ్యాండ్స్ ఫ్రీగా సిటీలో చక్కర్లు కొట్టేయొచ్చు.
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్ల వాడటం చాలా ఈజీగా ఉంటుందని టక్కీట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఎల్అండ్ ట మెట్రో ఎండి, సీఈఓ, కేవీబీ రెడ్డి తెలిపారు. ఎంత టైం లాకర్ యూజ్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకుని డిజిటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. మియాపూర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు