
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)
'రానే రాదు, కానే కాదు' అన్న ప్రత్యేక
రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘన చరిత్ర ఒక్క కేసీఆర్ దే అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు 'దీక్షా దివస్' సందర్భంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' వేదికగా ట్వీట్ చేశారు. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అన్న నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పిందని అన్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికిందని, తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని కొనియాడారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు.
పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం ఆయనదని తెలిపారు. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..