
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)
గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ
చోటు ప్రాంతాల్లో ఘోర బస్సు ప్రమాదాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదాలకు ట్రావెల్ ఎజెన్సీల నిర్లక్ష్యమే కారణమని పలువురు NHRC లో ఫిర్యాదు చేశారు. దీంతో వరుస ఘటనలపై విచారించిన భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) భద్రతా ప్రమాణాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. NHRC సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని బెంచ్, భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తక్షణమే తొలగించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉన్న బస్సుల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, తదనంతర మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి సారించిన NHRC ఈ కఠిన ఆదేశాలను ఇచ్చింది. స్లీపర్ కోచ్ బస్సుల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు, నిర్మాణ పరమైన లోపాల కారణంగా ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించి, త్వరగా తొలగించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసి, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాలను NHRC కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు