
ఆదిలాబాద్, 29 నవంబర్ (హి.స.)
జాతీయ రహదారి పక్కనే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన ఇప్ప రామన్న నిన్న సాయంత్రం పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు. శనివారం రూరల్ మండలం చాందా (టి) గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పొదల్లో పడి ఉన్న రైతును అటుగా పొలం పనులకు వెళ్తున్న స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హైవే అంబులెన్స్ సిబ్బంది వెంటనే రైతును జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైతు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనారోగ్య సమస్యల కారణంగా రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు