
అమరావతి, 29 నవంబర్ (హి.స.)శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన సైక్లోన్ దిత్వా భారత తీరం వైపుగా దూసుకొస్తోంది. ఉత్తర -వాయువ్య దిశగా కదులుతోన్న ఈ తుపాన్ ప్రస్తుతం ట్రికోమలికి 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్లు, కారైకల్ కు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తమిళనాడు - దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంగా వస్తున్న దిత్యా.. రేపు (నవంబర్ 30) తెల్లవారుజామున తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది.
ఈ క్రమంలో తమిళనాడులోని దక్షిణ, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలో అధికారులు అప్రమత్తమయ్యారు. విపత్తు నిర్వహణ బృందాలను సహాయక చర్యలకు మోహరించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే శ్రీలంకలో ఈ సైక్లోన్ సృష్టించిన వరదలకు 40 మందికి పైగా మరణించారు. మరో 20 మందికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
దిత్వా ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లే ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని హెచ్చరించింది. అలాగే నేడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV