
అమరావతి, 29 నవంబర్ (హి.స.)
రాజధాని అమరావతి (Amaravati) కోసం సాధ్యమైనంత త్వరగా భూసేకరణ చేపడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏపీసీఆర్డీఏ (APCRDA) అధికారులతో త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. పెద్ద రైతులకు భూముల కేటాయింపు కొంత ఇబ్బందులు ఉన్నాయన్నారు. వారికి లాటరీ పద్ధతిలో భూములను కేటాయించే ప్రణాళికలు రూపొందించామన్నారు. హెల్త్ కార్డ్, పింఛన్లు సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. గతంలో 38వేల మందికి హెల్త్ కార్డులు జారీ చేశామన్నారు. వారిలో 10 వేల మంది ఇప్పటికే ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. వీరిలో మరో నాలుగువేల మంది పిల్లలు పెద్దవారై, పెండ్లిలు అయ్యి తమ పిల్లలను కూడా జాబితాలో చేర్చాలని కోరుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులను తయారు చేశామన్నారు. పింఛన్లకు కూడా ఇతర పింఛన్లతో సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వం రాజధాని రైతుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాలను కలిపేయడం వల్ల ఇబ్బందులు తలెత్తాయన్నారు. కాబట్టి ప్రతి గ్రామానికి సీఆర్డీఏ అధికారులు వెళ్లి, సమస్యను గుర్తించి తగిన విధంగా నెల రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని హామీనిచ్చారు. దివ్యాంగులకు మళ్లీ పింఛన్ ఇవ్వడం, కొత్తవారిని చేర్చడం, పెద్దలు చనిపోతే పిల్లలకు ఇవ్వడం, హెల్త్ కార్డులను ఇవ్వమని అధికారులకు సూచించామన్నారు.
400కెవి లైన్స్, 200 కెవి విద్యుత్ లైన్స్ రెండిటికి టెండర్లు పిలిచామన్నారు. 400 కెవి లైన్స్ అక్టోబర్ 8, 2026 నాటికి పూర్తవుతుందన్నారు. ఈ లైన్ లో కాస్త కోర్టు వివాదం ఉందన్నారు. సీఆర్డీఏ ఇచ్చిన డబ్బును రైతులు తీసుకోలేదన్నారు. ల్యాండ్ పూలింగ్ కు రాక ముందే డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. రాజధాని వచ్చాక ల్యాండ్ పూలింగ్ లో తమను గుర్తించాలని వారు కోరుతున్నారన్నారని తెలియజేశారు. దానిపై మంత్రి నారాయణ సమీక్షిస్తున్నారని వెల్లడించారు. మిగిలిన 220 కేవీ లైన్స్ కు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జూలై 31, 2027కు పనులు పూర్తవుతాయన్నారు. విద్యుత్ లైన్ల గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
వెరిఫికేషన్ చేస్తున్నాం : మంత్రి నారాయణ
తాము రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. అధికారులను ఆదేశించి నిర్ణీత సమయాన్ని ఇస్తున్నామని అన్నారు. గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగినట్లు చెబుతున్నారన్నారు. వారి సమస్యను కూడా వెరిఫికేషన్ ద్వారా పరిష్కరించనున్నాం అని తెలియజేశారు. అందుకోసం అధికారులకు నెల సమయం ఇచ్చామన్నారు. జరీబు, నాన్ జరీబు వారివి కూడా వెరిఫై చేస్తామని ప్రకటించారు. లంక భూములు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. అసైన్డ్ భూములపై స్టడీ చేసేందుకు కమిటీ వేశామన్నారు. నివేదిక రావడానికి మూడు నెలల సమయం పడుతుందన్నారు. కేబినెట్ మీటింగ్ డిసెంబర్ 3వ తేదీన ఉంటుందన్నారు. దానిపై చర్చించిన అనంతరం జీఓ నుంచి రాజధాని అసైన్డ్ భూములు తొలగించడం జరగుతుందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చడం వ్యవస్థలో సాధ్యపడదని అర్థం చేసుకోవాలని రైతులకు విన్నవించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV