
అమరావతి, 3 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులను ఆకట్టుకుంటున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్ బోటనీ టీచర్ బల్లెడ అప్పలరాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన 27 సెకన్ల వీడియోను లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ల్యాబ్‌ను అద్భుతంగా మార్చిన టీచర్
పాతపట్నం మోడల్ స్కూల్‌లో బోటనీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అప్పలరాజు, తోటి సిబ్బంది సహకారంతో పాఠశాలలోని బయాలజీ ల్యాబ్‌ను కళాత్మకంగా, విజ్ఞానదాయకంగా తీర్చిదిద్దారు. కేవలం ప్రయోగ పరికరాలకే పరిమితం చేయకుండా, మానవ అవయవాలు, మొక్కల భాగాలు, నైతిక విలువలు, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన చేతిరాత పోస్టర్లు, రంగురంగుల చిత్రాలతో ల్యాబ్‌కు కొత్త రూపునిచ్చారు. విద్యార్థులు మైక్రోస్కోప్‌లతో ప్రయోగాలు చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఆకట్టుకున్నాయి. పరిమిత వనరులున్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ఎలా ఆసక్తికరంగా మార్చవచ్చో అప్పలరాజు ఆచరణలో చూపిస్తున్నారు.
టీచర్‌ను అభినందిస్తూ లోకేశ్ ట్వీట్
ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాన్ని చూసి ముగ్ధుడైన నారా లోకేశ్, అప్పలరాజు మాస్టారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. బల్లెడ అప్పలరాజు మాస్టారు, మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది. ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నంలో బోటనీ సబ్జెక్టు బోధిస్తూనే.. సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానవంతంగా తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తినిస్తోంది. సైన్స్, మోరల్ వేల్యూస్, జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ల్యాబ్‌ను ఆర్టిస్టిక్‌గా రూపొందించి, నిర్వహిస్తున్న తీరు అభినందనీయం అని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, అప్పలరాజు వంటి ఉపాధ్యాయుల కృషి పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాలను తగ్గించడానికి దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV