
న్యూఢిల్లీ, 30 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం
సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని టిగ్రి ఎక్స్ టెన్షన్లోని చెప్పుల దుకాణంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో అన్నా, చెల్లెలు సహా నలుగురు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రమాదంలో ఒక మహిళ సహా ఇద్దరు గాయపడినట్లు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగినట్లు సాయంత్రం 6.24 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చిందని, వెంటనే తమతో పాటు ఫైర్ సిబ్బందిని తీసుకుని ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో.. వాటిని అదుపుచేసేందుకు సుమారు 5 గంటల సమయం పట్టినట్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో మరణించినవారిలో భవనం యజమాని జిమ్మీ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించామని మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయపడినవారిలో ఒకరిని మమత (40) గుర్తించారు. 25 శాతం కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులువెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు