
కరీంనగర్, 4 నవంబర్ (హి.స.)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్
మండలం రేణికుంట గ్రామ రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేణికుంట శివారులో కి రాగానే ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్ లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్ ఎం డి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీ కొనడం తో ట్రాక్టర్ లో ఉన్న ధాన్యం బస్తాలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు